BHAGAVATA KADHA-3    Chapters   

గోధన హరణ సమయమునఁ గృష్ణ కృప

53

శ్లో || యద్‌ బాంధవః కురుబలాబ్ధి మనంతపార

మేకో రథేన తతరే7హమతీర్య సత్వమ్‌|

ప్రత్యాహృతం బహు ధనం చ మయా పరేషాం

తేజాస్పదం మణిమయం చ హృతం శిరోభ్యః ||

----భాగ. 1 స్కం. 15 అ. 14 శ్లో.

..... ...... ..... ..... ...... ..... .......

"గోగ్రహణము నాఁడు కురుకులాంభోనిధిఁ

గడచితి నెవ్వని కరుణఁజేసి

గీ|| కర్ణ సింధు రాజ కౌరవేంద్రాదుల

తలలపాగ లెల్లఁ దడవి తెచ్చి

యేమహాత్ము బలిమి నిచ్చితి విరటుని

పుత్రి యడుగ బొమ్మ పొత్తికలకు||"

అట్టివాఁడు "మనలను దిగనాడి చనియె మనుజాధీశా !"

----శ్రీ మదాంధ్ర భాగవతము.

ఛప్పయ.

కౌరవ ఔర త్రిగర్త సంధి కరి కరీ చఢా ఈ|

కరేఁ వాస అజ్ఞాత జహాఁ హమ పాంచోఁ భా ఈ ||

భీష్మ, కర్ణ, గురుద్రోణ, సుయోధనసబ మిలి కరికేఁ |

మత్స్య దేశ##పై చఢే చలే గోధన బహు హరికేఁ ||

బృహన్నలా తేఁ సారథీ బన్యోఁ హర్ష హియ మేఁ అమిత|

కహే ఉత్తరా సుఘర పట, లావేఁ మమ గుడియాన హిత||

అర్థము

కౌరవులు, త్రిగర్తరాజు సంధిచేసికొని మేమజ్ఞాత వాసము చేయుచున్న విరాట్రాజు మీఁదకు దండెత్తి వచ్చిరి. భీష్మ, ద్రోణ, కర్ణ, సుయోధనాదు లందఱును గలిసి మత్స్య దైశముపై దండెత్తి గోధనాదులను హరించిరి.

అప్పుడు త్తరుఁడు యుద్ధమునకు బయలుదేరి నన్ను 'బృహన్నలా ! సారథివి కమ్మనెను.' నేను సరేనని వెళ్లుచుండ ఉత్తర తన బొమ్మలకు మంచి మంచి గుడ్డలను బొత్తికలుగాఁ దెమ్మనెను.

------

సమృద్ధిశాలినియగు రాజధానినగర కవాటము తెరవఁ బడినప్పుడు దానినుండి చిత్రవిచిత్ర వేషములుగల స్త్రీపురుషులు బయలుదేరి వచ్చునట్లు, అర్జునుని స్మృతియను నగరకవాటము తెరువఁబడగానే దానినుండి ఒకకథతర్వాత నింకొక కథ బయలు దేరి వచ్చుచున్నది. శ్రీకృష్మ కృపచే నాతఁడేయే కార్యము లొనర్చెనో, ఏ అమానుషిక పౌరుషమును జూపించెనో వాటిని జ్ఞాపకము చేసికొనిన ఆతని హృదయము కరిగిపోయెడిది. ఆ కార్యము లన్నిటిలో నాతనికి మూర్తి మంతమగు నచ్యుతుని అనుగ్రహము కనఁబడుచుండెను.

వనవాసాంతరమున నాతనికి అజ్ఞాతవాసస్మృతి కలిగెను. ఆతఁడు కరుణాస్వరముతో తన యన్నయగు ధర్మరాజుతో నిట్లనెను :- " రాజా ! ఎంతని చెప్పుదును ? శ్రీకృష్ణ కృపకు అంతులేదు. మన అందఱమీఁద నాతనికి అపారకృప. హస్తినాపుర సమీపముననే మత్స్య దేశరాజధానిలో విరాట్రాజుదగ్గఱ మనము మారువేషములతో అజ్ఞాతవాసమును గడుపుచుంటిమి. దుర్యోధనుఁడు మనలను నలుదిక్కుల వెదకి వేసారెను. కాని జాడ దొఱకలేదు. వనవాస దుఃఖమున మనము ఆత్మహత్యలు చేసికొంటిమని ఆతఁడనుకొనెను. కాని మనమ తాఁబేలువలె నంగములు ముడుచుకొని యుంటిమి. కొంగవలె ధ్యానమును నటించుచు రాజ్య మను నాహారముకొఱకి బ్రతీక్షించుచుఁ గన్నులు మూసికొని మృషాసమాధిని నటించుచుంటిమి. ఆ సమయములో గౌరవ, త్రిగర్త నరపతులు కలిసి మత్స్య దేశముపై దండెత్తిరి. తనయొక్క సేనాపతి కీచకుని సహాయమున మత్స్యాధి పతియగువిరాట్రాజు త్రిగర్తాధిపతిని చాలభాధించెను. ఆ పూర్వ వైరమును పాటించి కసితీర్చుకొనుటకు సుశర్మ కౌరవుల సహాయతను బొంది మత్స్యదేశముపైకి దండెత్తి వచ్చెను. ఆతఁడొక ప్రక్కను దండెత్తెను. ఇది కనిపెట్టి కౌరవులు, విరాట్రాజు తన సేనలతో త్రిగర్తరాజుతోఁ బోరాడుచున్నప్పుడు తాము ఇంకొకవైపున ముట్టడించి శూన్యనగరమునుండి గోధనమును, రత్నాభూషణములను హరించుకొని పోవచ్చు ననుకొనిరి. చివర కట్లే చేసిరి. మీరు భీమసేనుని దీసికొని విరాట్రాజుతో త్రిగర్తులతోఁ బోరాడఁ బోయితిరి. ఇచ్చట విరాట్రాజు కొమారుఁడు ఉత్తరుఁడు ఒంటరిగా నగరరక్షణ కొఱకు ఉండెను. ఆ సమయమునఁ గౌరవులు సమస్త గోవుల నపహరించిరి. గోరక్షకులు వచ్చి యీ సమాచారమును రాజకుమారుఁడగు ఉత్తరునకుఁ జెప్పిరి. ఉత్తరకుమారుఁడు రాణివాసములో నిట్లు ప్రగల్భములు పలుకు చుండెను:- " నాకు తగిన సారథి యుండిన యెడల నే నిప్పుడే సమస్త కౌరవసేనను ఓడఁగొట్టి గోవులను విడిపింపఁ గలను."

ఆ సమయమున నీభార్యయగు ద్రౌపది సైరంధ్రీ వేషమును ధరించి అతఃపురములో నుండెజిది. నేను నపుంసకుఁడగు బృహన్నలా వేషమును ధరించి విరాట్రాజు కూఁతురగు ఉత్తరకు నృత్యగానములను నేర్పుచుంటిని. నేను సారథ్యములోఁజాల గొప్పవాఁడనని ద్రౌపదీ ద్వారా ఉత్తరకుమారునకుఁ దెలిసెను. ఆతఁడు నా యథార్థస్వరూపమును దెలిసికొనఁజాలక పోవుటచే నన్నుఁదనకు సారథికావలసినదని బలవంతము చేసెను. అజ్ఞాత వాసము గడువు ముగియుటచే, ఇదియే యుద్ధమునకు మంచి సమయమనుకొని అంగీకరించి, రథమును గట్టి ఉత్తరుని యెదుట నిలుచుంటిని.

మేము సిద్ధపడి పోఁబోవఁగా బాలచాపల్యముచే ఉత్తరుని చెల్లెను ఉత్తర నాతో నిట్లనెను :- " బృహన్నలా ! మా అన్న కౌరవులను గెల్చి వచ్చునప్పుడు నాబొమ్మలకు రంగురంగుల పొత్తికలను తేవలయును" నేనను వినోదముతో నిట్లంటిని:-" దుర్యోధన, కర్ణాది వీరుల వస్త్రములను నీకొఱకు తెచ్చెదను. " నవ్వుటాల కిట్లని నేనుత్తరకుమారుని రథమును నడుపుచుఁ గౌరవసేనా సమూహము వైపునకుఁ బోయితిని. వర్షాకాలమున నున్న ఘనఘోర మేఘజాలములవలె సర్వత్ర వ్యాపించి, సముద్రమువలె నుప్పొంగుచున్న అపార కౌరవసేనను గాంచునప్పటికి ఉత్తరునకు గుండె లదరెను. వానికి శరీర మంతటను జెమట పోయుచుండెను. భయముచే నాతఁడు గడగడ వణఁకుచుండెను. భయపడుచు నాతఁడిట్లనెను :- " బృహన్నలా ! నీవు త్వరగా నారథమును నగరమువైపునకు త్రోలుము. ఈ యోధులతో నేను బోరాడఁజాలను. మన గోవులను దీసికొని పోయినఁ దీసికొనిపోనిమ్ము. ఇంక కావలసినన్ని గోవులు వచ్చును. బ్రతికియుండిన బలుసుఆకు ఏరుకొని తినవచ్చును. ఐశ్వర్యములవే రాఁగలవు."

నే నాకుఱ్ఱవానికి అనేకవిధములఁ జెప్పిచూచితిని . వివిధ విధముల ధైర్యము చెప్పితిని. వీరతావాక్యములను బలికి ఆతని నోదార్చితిని. వీరధర్మములను జెప్పితిని. యుద్ధమర్మమును బలికితిని. యుద్ధపరాఙ్ముఖుఁడగుట క్షత్రియులకు గొప్ప యధర్మని చెప్పితిని; కాని ఆతఁడు వినలేదు. ఆతఁడంతగా భయభీతుఁడయ్యెను. నేను రథమును వెనుకకుఁ ద్రిప్పకపోవుటను గాంచి, ఆతఁడొంటరిగా రథమునుండి దుమికి పాఱిపోవుచుండెను. నేను రథమునాపి పరుగెత్తి వానిని బట్టుకొంటిని. ఆతఁడత్యంతాకులుడై నన్ననేక విధముల బ్రదిమిలాడుకొనెను, వివిధ ప్రలోభములఁ బెట్టుచుండెను. అంత నాకు నవ్వువచ్చి యిట్లంటిని:- " వత్సా ! నీవు భయపడవలదు. నేనే యుద్ధము చేయుదును. నీవు నారథమును త్రోలుము."

ఆతఁడు భయపడుచు నిట్లనెను :- " నీవు నపుంసకుఁడవు. ఆటపాటలు నేర్చినవాఁడవు యుద్ధమేమి చేయఁగలవు ? నీవు మునిఁగిపోవుదువు, నన్ను ముంచెదవు."

ఆతఁడత్యంత భయభీతుఁడగుటను గాంచియు, వణఁకుటను గాంచియు నేను నాపరిచయమును గావించుచు నిట్లంటిని:- " నేను నపుంసకుఁడను గాను. నేను గాండీవ ధనుర్ధారిని. శ్రీకృష్ణ సఖుఁడగు నర్జునుఁడను. వాసుదేవుని కృపచే నేను సమస్తము చేయఁగలను. సుసజ్జితమగు నీసేననంతను నేనొక్కఁడనేయోడింపఁ గలను. కృష్ణ కృపచే నాకేపనియు కఠినము కాదు. చేయఁజాలని పనిలేదు. అసంభవమేమియును లేదు. నిర్భయముగ నుండుము."

అనేక ప్రశ్నలడిగిన మీఁదట, శమీవృక్షము మీఁద దాఁచి యుంచఁబడిన గాండీవ ధనస్సును గాంచగానే ఆతనికి నమ్మకము కలిగెను. నే నర్జునుఁడనేనని తెలిసికొని నాకు సారథ్యము వహించుటకు అంగీకరించెను.

నేను నాగాండీవ ధనుస్సునకు నారి తగిలించి ధనుష్ఠకారము కావించితిని. నాధనుష్ఠంకారమును విని కౌరవులు హడలిరి. ప్రళయ కాలాంతకుఁడగు నర్జునుఁడే మనతో యుద్ధము చేయవచ్చుచున్నాఁడని వారు గ్రహించిరి. ఆ సమయమున గాండీవ ధనుస్సును గొని త్రైలోక్య విజయులగు భీష్మ, ద్రోణ, కర్మ, దుర్యోధనాది ప్రబల పరాక్రములును, ప్రసిద్ధయోధులు నగు వారి సమ్ముఖమున నొక్కఁడనే యుద్ధముచేయ సిద్ధపడితిని. అనేకాక్షోహిణీ సేనతో సుసజ్జితమై సకల ప్రపంచమును సంహారము చేయఁగల వందలకొలఁది శూర వీర సేనాపతి సమూహమెక్కడ, రెండవప్రక్క నేనొక్కడ నెక్కడ ? అయితే నాకు శ్రీకృష్ణుఁడాధారము కలఁడు. ద్వారకాధీశుని ఆశ్రయముకలదు. బలరామ సోదురుని బలమున్నది. కృపాసాగరుని కృపావలంబమున కలదు. నేను భయపడలేదు. నిర్భయుఁడైన వారినందఱను యుద్ధమునకుఁ బిలిచితిని.

నేను యుద్ధణునకు వచ్చుటను గాంచి కౌరవసైనికులు వారిలోవారు వాదవివాదములు పడసాగిరి. కర్ణుఁడు నన్ను తుచ్ఛుఁడనెను. కృపాచార్యుఁడు నన్ను ఁ బ్రశంసించెను. నలుగురు నానావిధముల ననుకొనఁజొచ్చిరి. ఇట్లు వాదవివాదములు పడుచుండఁ గాంచి భీష్మపితామహుఁడు అందఱును శాంతింపఁ జేసెను. అంత నందఱును గలిసి యుద్ధమునకు వచ్చిరి.

రాజా ! ఆ సమయమున ఘనఘోరయుద్ధము జరిగెను. సైనికు లందఱును బూర్ణశక్తితో నన్ను బరాజితులఁ జేయ యోజించుచుండిరి. అందఱును గలిసి నన్ను ఁ బడఁగొట్టఁదలఁచిరి. కాని ఆనందకందుఁడగు నందనందనుఁడు తన అపారమగు బ్రేమచే వారి కోరికలు నెఱవేరనీయలేదు. కర్ణ, కృపాచార్య, ద్రోణాచార్య, అశ్వత్థామ, భీష్మ దుర్యోధనాదులు ఒకరితర్వాత నొకరు నాతోఁ బోరవచ్చిరి. కాని నేనందఱ నోడించితిని. అందఱును యుద్ధమునకు భయపడి పారిపోయిరి. అందఱు పరాజితులైన తర్వాత కర్ణుఁడు సంబాళించుకొని మరల నాతో యుద్ధము చేయవచ్చెను. ఆ సమయమున నెవరిని జంపవలెనని నాకు లేదు. వారినెట్లైనఁ బరాజితులఁగావించి విరాట్రాజు గోవులను గొనిరావలెననియే నా ముఖ్యాభిప్రాయము. అందువలన నొక్క సేనాపతి నైన నేను జంపలేదు. సైనికులు మాత్రము చచ్చిరి. అందఱు పరాజితులైన తర్వాత వారిమీఁద నేను మోహనాస్త్రమును విడిచితిని. దానికి వారందఱు మోహితులె సంజ్ఞాశూన్యులై యుద్ధభూమియందు చచ్చినవారివలెఁ బడిపోయిరి. నేనుత్తర కుమారునితో నిట్లంటిని :- " వత్సా ! నీవువెళ్లి మోహితులై మూర్ఛ చెందిన ముఖ్యముఖ్య వీరుల మణిమయ మకుటములను, బాగుగాఁ బ్రకాశించుచున్న పట్టు ఉత్తరీయములను ఉత్తర బొమ్మ పొత్తి లకై తీసికొని రమ్ము వీటిని దీసికొనిపోయి నీచెల్లెలు ఉత్తరకిచ్చిన నామె చాల ఆనందపడఁగలదు. ముదిత మనస్కయై వీటిని గొని తన బొమ్మలకు వీటిని గట్టి ఉల్లాసముతో నాడుకొనఁగలదు."

నాయజ్ఞాను బొంది ఉత్తర కుమారుఁడు రథము నాపి అమూల్యములగు వస్త్రాభూషణములను వలుచుకొనెను. అన్నిటిని దీసికొని భీష్మ పితామహుని దగ్గఱకు వెళ్లుచుండఁగా వానిని వారించి నేనిట్లంటిని :- " వత్సా ! అచ్చటకు వెళ్లవలదు. ఈ భీష్ముఁడు నాకు రక్షకుఁడగు శ్రీకృష్ణునకు పరమ భక్తుఁడు. లోకములో నీతనిని బరాజితుని గావింపఁగలవాఁడు కాని, సమ్మోహితునిఁ జేయఁగలవాఁడు కానిలేఁడు. ఈ సమ్మోహనాస్త్రముచే భగవత్కృపచే నీతఁడు సమ్మోహితుఁడు కాలేదు. జాగ్రతలోనే యున్నాఁడు. ఆతని వైపు చేయిజాపితివా నీ ప్రాణములు సున్న."

నా మాటను విని ఉత్తరుఁడు వెళ్లినావాఁడట్లే తిరిగి వచ్చెను. ఆతఁడు పితామహుని వస్త్ర మకుటములను గొనవలెనను యూహను మానుకొనెను.

రాజా ! ఆ సమరమున నెంతటి యద్భుత కాండము జరిగినది. దుర్యోధనుని గర్వ ముడిగిపోయెను. కౌరవుల మనోరథము విఫలమయ్యెను. త్రిగర్తునితో ఁ జేసికొనిన సంధి సఫలము కాలేదు. వారిచేతికి విరాటుని ధనమును జిక్కలేదు. ఆవులును చిక్కలేదు. పైగా బరాజయము పొందవలసి వచ్చినది. సైనికులందఱు మూర్ఛపడిపోఁగానే గోపాలకులతో తమ గోవులను తోలుకొని పొమ్మంటిని. నేనన్నదే తడువుగా గోపాలకులు గోవుల నన్నిటిని దోలుకొని పోయిరి. గోవులు కూడ శత్రువిముక్తలై తోఁకలెత్తుకొని నగరము వైపునకుఁ బరువిడు చుండెను.

ఈవిధముగ రాజా ! ఇంత యపార కౌరవసేనాసముద్రమును ఎవని కృపచే నవ్వుచు నవ్వుచు, హేలాపూర్వకముగ నిమిషములో దాఁటఁగలితినో , ఎవని యనుగ్రహముచే భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాశ్వత్థామ దుర్యోధనాది వీరులు నాకు తృణ సమానముగఁ గనఁబడిరో అట్టి వాసుదేవ భగవానుఁడు మనలను వదలి స్వధామమునకుఁబోయెను. ఇప్పుడు నాకా తేజస్సుగాని, బలముగాని లేదు. ఆశక్తియు లేదు; ఆసాహసమును లేదు. ఇప్పుడు నేను నిర్బలుఁడను, సాహసవిహీనుఁడ నైతిని. రాజా ! మనము కూడ ఇఁక నాతని ననుసరింపవలయును." ఇట్లు చెప్పు చుండఁగా అర్జునుని కంఠము రుద్ధమయ్యెను.

ఛప్పయ

ఉత్తర ఉత హీ చల్యో జాఁయ కౌరవ గౌలూటేఁ |

సేనా లఖీ మహా9 కుఁవర కే ఛక్కే ఛూటేఁ ||

నిజ పరిచయ కరవాఇ యుద్ధ కీ కరీ తయారీ|

సంధాన్యో గాండీవ శత్రు సేనా సంహారీ ||

లహీ విజయ మూర్ఛిత కరే, ముకుట, వస్త్ర గోధనలయే|

కరే కాజ జినకృపాతేఁ , హాయ్‌ ! కృష్ణ వేతజి గయే||

అర్థము

అర్జునుఁడిట్లనెను :- కౌరవులు గోధనహరణము చేసిన చోటకు ఉత్తరుఁడు వెళ్లెను. సేనను జూడఁగానే ఉత్తరకుమారునకు గుండెలు పగిలెను. అంత నతఁడు పారిపోఁగా నాపి నాపరిచయమును గావించి యుద్ధమునకు సిద్ధపడి, గాండీవమున నారాచములు సంధించి శత్రుసేనను సంహరించితిని.

మిగిలిన పెద్ద పెద్ద యోధులను జంపక మూర్ఛపడఁగొట్టి వారి ముకుట వస్త్రములను హరించి, గోధనములను గొనిపోయితిమి. ఇవన్నియు నెవని కృపచే జరిగెనో అట్టి మన శ్రీకృష్ణుఁడు మనలను వదలిపోయెనుగదా!

BHAGAVATA KADHA-3    Chapters